చండీగఢ్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) జాతీయ అధ్యక్షుడు అజయ్‌సింగ్ చౌతాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ‘యువకుల్లారా పాలకులను గద్దెమీద నుంచి కిందకు లాగండి. వీధుల్లో వారిని తరిమికొట్టండి. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ పాలకుల్లా వారు కూడా దేశాన్ని వదిలిపోయేలా ఒత్తిడి తెండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ‘యువకుల్లారా.. వయోజనుల్లారా.. ఇది మార్పునకు సమయం. మీరే ఈ మార్పును తీసుకురావాలి. దీనికోసం సంఘటితమై ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆయన అన్నారు. మహేంద్రగఢ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇందుకోసం నేపాల్, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఉద్యమాల వంటివి భారత్‌లో కూడా ప్రారంభం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఆ రెండు దేశాల్లో జరుగుతున్న ఆందోళనల్లో ప్రజలు ముఖ్యంగా యువత భారీ సంఖ్యలో పాల్గొంటున్నారని, అటువంటి చైతన్యం భారత్‌లోనూ రావాలన్నారు. యువత సంఘటితం కావాలని అన్నారు. మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, నేపాల్‌లో యువత ఆందోళనలకు జడిసి అక్కడి పాలకులు పారిపోయారని గుర్తుచేశారు. మన దేశంలో కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అటువంటి ఎత్తుగడలు అనుసరించాలని ఉద్బోధించారు. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌లాగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. చౌతాలా వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రతినిధి భండారీ ఖండించారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రోద్బలంతోనే చౌతాలా భారత్‌కు వ్యతిరేకంగా అగ్గి రాజేస్తున్నారని మండిపడ్డారు.