Amit Shah : మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్పై లోక్సభలో గురువారం చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ మధ్య మాటలయుద్ధం నడిచింది. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అలాగే, ఈ బిల్లును ఇప్పుడు చేపడుతున్న జనాభా లెక్కలతో అనుసంధానం చేయాలని సూచించారు.
కానీ, కేంద్రం ఈ బిల్లులో వెనుకబడిన వర్గాల మహిళలకు, ముస్లిం మహిళలకు ప్రత్యేక కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యంగా వ్యతిరేకం అని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా స్పందించారు. అఖిలేష్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు జనాభా లెక్కల్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, ఇటీవల ప్రారంభమైన జనాభా గణన ప్రక్రియ 2027 నాటికి పూర్తవుతుందన్నారు. అలాగే, కుల గణన కూడా చేపడతామన్నారు. అయితే, మతం ఆధారంగా సీట్లు కేటాయించడం, చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగా వ్యతిరేకం అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను రాజ్యాంగం అంగీకరించబోదన్నారు. అంతగా కావాలనుకుంటే సమాజ్వాదీ పార్టీ తన సీట్లన్నీ ముస్లింలకే కేటాయించాలి’’ అంటూ షా వ్యాఖ్యానించారు.
దీనిపై మరో ఎస్పీ నేత ధర్మేంద్ర యాదవ్ స్పందిస్తూ షా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్నారు. అఖిలేష్ స్పందిస్తూ.. ముస్లిం మహిళలు మన సగం జనాభాలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా అమిత్ షా మాట్లాడటం సరికాదన్నారు. అమిత్ షా, ఎస్పీ నేతల మధ్య వాదన సాగుతుండటంతో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకుని, ఇరువురిని శాంతింపజేశారు.