RIL : కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అరుదైన ఘనత సాధించింది. వరుసగా 21 ఏండ్ల పాటు ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత కంపెనీగా ఆర్ఐఎల్ నిలిచింది. 2021లో 155వ స్ధానం నుంచి గత మూడేండ్లలో అప్రతిహతంగా ఎదిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 69వ స్ధానాలకు ఎగబాకి 86వ స్ధానంలో నిలిచింది.
గత 21 ఏండ్లుగా స్ధిరంగా ఈ జాబితాలో ఇతర ఏ భారత కంపెనీ నిలకడగా చోటు దక్కించుకోలేదు. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల లావిష్ వెడ్డింగ్ అనంతరం కంపెనీ ఈ ఫీట్‌ను నమోదు చేయడం గమనార్హం. ఇక ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో 9 భారత కంపెనీలు చోటు దక్కించుకోగా వాటిలో 5 ప్రభుత్వ రంగ సంస్ధలే కావడం విశేషం.
2024 జాబితాలో ఎల్ఐసీ 12 స్ధానాలను మెరుగుపరుచుకుని 95వ స్ధానంలో నిలిచింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ 22 స్ధానాలను కోల్పోయి 116వ ర్యాంక్‌కు పడిపోయింది. మరోవైపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఏకంగా 178వ స్ధానానికి ఎగబాకింది. ఇంకా ఈ జాబితాలో బీపీసీఎల్, ఓఎన్జీసీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, హెఛ్డీఎఫ్సీ బ్యాంక్ చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో స్టేట్‌గ్రిడ్, వాల్‌మార్ట్, అమెజాన్లు టాప్ 3లో నిలిచాయి. టాప్ 100 జాబితాలో మెటా ప్లాట్‌ఫామ్స్, యాపిల్, టొయోటా మోటార్స్, అల్ఫాబెట్, శాంసంగ్ వంటి ప్రముఖ కంపెనీలున్నాయి.
Read More :