Salt | న్యూఢిల్లీ: ఉప్పు మనుషుల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతున్నది. గుండె జబ్బు, స్ట్రోక్, మూత్రపిండాల జబ్బులకు కారణమవుతున్న ఉప్పు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నది. ఈ నేపథ్యంలో ఉప్పు వినియోగానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గత ఏడాది మార్గదర్శకాలను జారీ చేసింది. భారత్లోని ప్యాకేజ్డ్ ఆహార తయారీలో ఈ మార్గదర్శకాలను పాటిస్తే దశాబ్దకాలంలో మూడు లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చని, 17 లక్షల మందికి గుండె జబ్బులు రాకుండా చూడొచ్చని జార్జ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అనే సంస్థ పేర్కొన్నది. భారత్లో ఉప్పు వినియోగంపై ఈ సంస్థ చేసిన అధ్యయన వివరాలు లాన్సెట్ పబ్లిక్ హెల్త్ అనే ప్రఖ్యాత జర్నల్లో ప్రచురితమయ్యాయి.
గుండెజబ్బులను నివారించేందుకు ఒక మనిషి ఒక రోజుకు ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు(దాదాపు 2 గ్రాముల సోడియం) తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నది. ప్యాకేజ్డ్ ఆహారాల్లో సోడియం ఎక్కువగా ఉంటున్నదని ఈ అధ్యయనం పేర్కొన్నది.వినియోగదారులకు ఒకసారి ఉప్పు ఎక్కువగా ఉండే ప్యాకేజ్డ్ ఆహారాలు అలవాటు అయితే తగ్గించడం కష్టమని, కాబట్టి వెంటనే వీటిల్లో సోడియం వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. భారత్లో ప్యాకేజ్డ్ ఆహారంలో డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల మేరకు సోడియంను వినియోగిస్తే దశాబ్దకాలంలో మూడు లక్షల మరణాలు, 17 లక్షల గుండె జబ్బులు, ఏడు లక్షల మూత్రపిండాల జబ్బులు రాకుండా నివారించొచ్చని, దీర్ఘకాలిక జబ్బుల కోసం వైద్యసేవలకు అయ్యే రూ.6,730 కోట్లను ఆదా చేయొచ్చని అంచనా వేసింది.