ఆదివారం 31 మే 2020
National - May 11, 2020 , 01:21:08

కరోనా ‘కోత’లు

కరోనా ‘కోత’లు

  • అన్ని రంగాలనూ తీవ్రంగా దెబ్బతీసిన మహమ్మారి
  • ఆంక్షల సడలింపు తర్వాతా ప్రభావం కొనసాగే అవకాశం

నేషనల్‌ డెస్క్‌:కరోనా గుప్పిట్లో చిక్కి యావత్‌ ప్రపంచం విలవిల్లాడుతున్నది. ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. దాదాపు అన్ని రంగాలు ప్రభావితమయ్యాయి. ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి తిష్ఠవేస్తుందో తెలియని పరిస్థితి. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు పలు దేశాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. అయితే కరోనాకు ముందులా పరిస్థితులుండవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏయే రంగాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎలాంటి మార్పులు రానున్నాయి అన్నదానిపై ప్రత్యేక కథనం..                           

నెగెటివ్‌ వృద్ధిరేటు

ఈ ఆర్థిక సంవత్సరం భారత్‌, చైనాలో మినహా మిగిలిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నెగెటివ్‌ వృద్ధిరేటు నమోదుకావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. 2021లో మాత్రం చాలా దేశాల్లో 2019 కంటే అధిక వృద్ధిరేటు నమోదయ్యే అవకాశ మున్నదని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రపంచదేశాలు సమర్థ చర్యలు చేపడితే ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు తిరిగి 5.8 శాతానికి ఎగబాకొచ్చని తెలిపింది. పర్యాటకం తిరోగమనం..

అంతర్జాతీయ పర్యాటక సంస్థ అంచనాల ప్రకారం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య 20-30% తగ్గనుంది. ఈ లెక్కన భారత్‌లో పర్యాటక రంగం 8 ఏండ్లు వెనక్కి వెళ్లనుంది. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రకారం.. ఈ ఏడాది పర్యాటక రంగానికి దాదాపు రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లనుంది. ఉద్యోగాల కోతతో కోటి మంది ప్రభావితం కానున్నారు.థియేటర్లకు గడ్డు కాలం

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు గడ్డుకాలం తప్పేలా లేదు. ఇకపై చాలా వరకు సినిమాలు ఆన్‌లైన్‌లోనే రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా థియేటర్లలో విడుదలైన 90 రోజులకు ఆయా సినిమాలను ఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేస్తుంటారు. టికెట్‌ విక్రయాల ద్వారానే అధిక ఆదాయం పొందే స్టూడియోలు ఈ గడువును తగ్గించేందుకు ఇప్పటివరకు నిరాకరిస్తూ వచ్చాయి. గత కొన్నేండ్లలో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ వేదికలు విశేషంగా పుంజుకున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో  ఈ ఏడాది పలు భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ వేదికలపైనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

 గేర్‌ మారేనా?

2019లో కార్ల విక్రయాలు ఆశించినంతగా లేవు. అయితే కరోనా కారణంగా వ్యక్తిగత వాహనాలకు ప్రజలు మొగ్గుచూపే అవకాశమున్న నేపథ్యంలో అమ్మకాలు పుంజుకుంటాయని ఆటోమొబైల్‌రంగం ఆశిస్తున్నది. అయితే ఆర్థికమాంద్యం వారి ఆశలపై నీళ్లు చల్లే అవకాశం కనిపిస్తున్నది. ఇదే జరిగితే ఇండస్ట్రీ మరో పదేండ్లు వెనక్కే.

రెక్కలు తెగిన విమానం..

కరోనా కారణంగా రవాణా రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రత్యేకించి విమానయాన రంగంపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నది. గతేడాది మార్చితో పోలిస్తే, ఈ ఏడాది మార్చిలో దేశీయ విమాన రద్దీ 11.8 శాతం పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అయితే 52.9 శాతం పడిపోయింది. నాలుగేండ్ల కిందటితో పోలిస్తే, ఈ ఏడాది దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 10 కోట్లు తగ్గనుంది. 

ఆఫీస్‌ స్పేస్‌కు తగ్గనున్న డిమాండ్‌

ప్రస్తుత కొవిడ్‌ యుగంలో చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌కు జైకొడుతున్నాయి. ఈ క్రమంలో, ఖాళీ అయ్యే కార్యాలయాల స్థలాలను నివాస అవసరాలకు వాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా చాలా కంపెనీలు ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు అనుమతించనున్నాయి.logo