Red alert : కేరళ (Kerala) లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు (Northwest Monsoon) సాధారణం కంటే ముందుగానే కేరళను పలకరించడంతో అక్కడ వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. దాంతో వయనాడ్ (Wayanad) లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా అదే పరిస్థితి నెలకొంది. సోమవారం ప్రజలను ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్ఇండియా సహా పలు ఎయిర్లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి.
సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లో వివరాలను పరిశీలించాలని సూచించాయి. దాదార్, మహిమ్, పరెల్, బాంద్రా, కాలాచౌకీతోపాటు ఇతర ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అలాగే ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ధౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్ పురాలు నీట మునిగాయి. విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. భారీ వానల కారణంగా తమిళనాడులోని ఊటీలో ఆదివారం ఒక బాలుడిపై చెట్టుపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలో బెళగావి జిల్లాలో గోడకూలి నిద్రలోనే మూడేళ్ల బాలిక మృతి చెందింది.