Software Employees | న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మాంద్యం భయాలు, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో వర్డ్ ప్రెస్ డెవలపర్ ఆటోమెటిక్, జాక్ డార్సీకి చెందిన బ్లాక్, సిమెన్స్ లాంటి దిగ్గజ కంపెనీలు పలు కారణాలు చూపుతూ పెద్దయెత్తున ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్.ఎఫ్వై వెబ్సైట్ వివరాల ప్రకారం, 2025లో సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27,762 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు ఏడాది టెక్ రంగంలో 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ట్రంప్ అన్ని దేశాలపై టారిఫ్లను విధించడంతో ఈ సమస్య నుంచి బయటపడటానికి ఉద్యోగుల తొలగింపు ఒక్కటే మార్గంగా కంపెనీలు ఎంచుకుంటున్నాయి. లాభాలు, పెట్టుబడుల స్థాయిని పెంచుకోవడానికి ఇటీవల వర్డ్ ప్రెస్ డెవలపర్స్ తమ సంస్థలోని వివిధ శాఖలకు చెందిన 280 మంది (16 శాతం) ఉద్యోగులను తొలగించింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సేకు చెందిన బ్లాక్ 931 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది.