హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలపై ట్యాక్స్‌ల భారం నానాటికీ తీవ్రమవుతూ వస్తున్నది. 2017-18లో రూ. 7.41 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు.. 2024-25 నాటికి 22 లక్షల కోట్లకు చేరాయి. ఈ 8 ఏండ్లలో ఒక్కో భారతీయు డిపై జీఎస్టీ రూపేణా రూ.81 వేల భారం పడింది. కేంద్రానికి జీఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం గడిచిన ఐదేండ్లలో రెట్టింపు కాగా.. 8 ఏండ్లలో మూడింతలైంది. ఆ మొత్తం సామాన్యుడి నుంచే వసూలు చేసిందే కావడం గమనార్హం. 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. 17 స్థానిక పన్నులు, 13 సెస్సులను ఏకీకృతం చేసి.. ఐదంచెల వ్యవస్థగా దీన్ని రూపొందించారు. అప్పటినుంచి ఏటా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. 2017-18లో జీఎస్టీ వసూళ్లు రూ.7.41 లక్షల కోట్లుగా ఉండగా 2024-25లో రూ.22.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే గడిచిన 8 ఏండ్లలో వసూళ్లు మూడురెట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 22.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇదే జీవనకాల గరిష్ఠం. అలాగే, 2020-21లో రూ. 11.37 లక్షల కోట్లతో పోలిస్తే తాజా వసూళ్లు రెండింతలయ్యాయి. అంటే గడిచిన ఐదేండ్లలో జీఎస్టీ వసూళ్లు రెండింతలైనట్టు లెక్క. 2023-24లో వసూలైన రూ. 20.18 లక్షల కోట్లతో పోలిస్తే, తాజా వసూళ్లు 9.4% ఎక్కువగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లుగా ఉండగా గత ఏప్రిల్ ఒక్క నెలలోనే అత్యధికంగా రూ. 2.37 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి వసూళ్లలో ఇదే అత్యధికం. ఇక, గత మేలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ. 2.01 లక్షల కోట్లు కాగా, జూన్‌లో రూ. 1.85 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. గడిచిన ఎనిమిదేండ్లలో జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతున్నది. 2017లో ఈ సంఖ్య 65 లక్షలుగా ఉండగా.. ప్రస్తుతం 1.51 కోట్లకు చేరింది.
సామాన్యులకు మేలు జరుగుతుందని, పన్నుల విధానంలో తాము నూతన విప్లవం తెచ్చామంటూ ఎనిమిదేండ్ల కిందట కేంద్రం జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. అయితే, జీఎస్టీ కారణంగా పేద, మధ్యతరగతి వర్గాలపై అదనపు భారం పడినట్టు ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ట్యాక్స్ పడని అనేక వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తేవడం, శ్లాబులను తరచూ మార్చుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతున్నదని అంటున్నారు. మొత్తంగా ఈ విధానం ప్రజలకు శాపంలా మారిందని చెప్తున్నారు. అధిక జీఎస్టీ పన్నుతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతున్నదని ‘ఫైనాన్షియల్ అకౌంటబులిటీ నెట్వర్క్ ఇండియా’ కూడా తన రిపోర్టులో తెలిపింది.
ప్రస్తుతం 160కిపైగా దేశాల్లో జీఎస్టీని అమలు చేస్తున్నారని, 28% శ్లాబ్ మాత్రం భారత్‌లో మినహా మరే దేశంలో లేదని నిపుణులు అంటున్నారు. అంటే ప్రపంచంలో అత్యధిక జీఎస్టీని (28%) వసూలు చేస్తున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉన్నట్టు చెప్తున్నారు.
జీఎస్టీ ప్రవేశపెట్టడంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు పెరుగుతుందని, ధరలు తగ్గుతాయని కేంద్రం చెప్పినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ఆర్థిక వేత్తలు చెప్తున్నారు. దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టక ముందు 2016లో 4.9 శాతంగా ద్రవ్యోల్బణ రేటు ఉండగా, జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత 2022-23లో ఈ మొత్తం ఏకంగా 6.7 శాతానికి పెరిగింది. కాబట్టి పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పన్ను శ్లాబుల్లో మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పన్నులను కేవలం ఖజానాకు రాబడిగా మాత్రమే చూడకుండా ప్రజా ప్రయోజనాలను రక్షించాలని కోరుతున్నారు. కాగా అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ జీఎస్టీ విధానాన్ని అమలు చేయడం లేదు. మలేషియా 2018లోనే ఈ విధానాన్ని రద్దు చేసుకున్నది.
పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. వసతులు పెంచాలి. ప్రజల అవసరాలు తీర్చేలా పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టాలి. కానీ ఎన్డీయే పదకొండేండ్ల పాలనలో ఇందుకు భిన్నంగా జరుగుతున్నదని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూళ్లు గణనీయంగా పెరిగినా.. రోడ్లు, రైల్వేలు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆ మేరకు పురోగతి కనిపించడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. రోడ్లు అధ్వానంగా ఉండటంతో సగటున గంటకు 20 మంది, రోజుకు 500 మందికిపైగా, ఏడాదికి 1.50 లక్షల మందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రైల్వే భద్రత, ఆధునీకరణకు నిధులను సక్రమంగా వినియోగించకపోవడం వల్ల రైలు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. భారత రైల్వే లెక్కల ప్రకారం.. 2014-2023 మధ్య 638 రైలు ప్రమాదాల్లో 781 మంది చనిపోయారు.
జీఎస్టీ ఆదాయాన్ని సరైన నిష్పత్తిలో ప్రజల విద్య, వైద్య-ఆరోగ్య సంరక్షణ కోసం వినియోగించాలని ఆర్థిక వేత్తలు చెప్తున్నారు. కానీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అత్యవసర వైద్య సేవలు ఇప్పటికీ ప్రజలందరికీ అందుబాటుకి రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం కంటే ఎకువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా వైద్య సిబ్బంది లేరని, అవసరమైన మందులు కూడా లేవని 2024లో ఒక నివేదిక వెల్లడించింది. నాణ్యత లేని వైద్య సంరక్షణ వల్ల ప్రతి లక్ష జనాభాకు ఏటా 122 మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికీ దేశంలో 51 శాతం కుటుంబాలు వైద్యసేవలకు ప్రైవేటు హాస్పిటళ్లనే ఆశ్రయిస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో పథకాన్ని ప్రారంభించినా.. దీనిని ప్రజలందరికీ చేరువ చేయడంలో మాత్రం విఫలం అయ్యింది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నారు.
గత పదకొండేండ్ల మోదీ పాలనలో ధరలు పెరగడంతోపాటు పన్నులు కూడా పెరిగాయి. జీఎస్టీ కారణంగా ప్రతి వస్తువు, సర్వీస్‌పై పన్ను విధించారు. దీంతో సాధారణ పౌరులతో పాటు పేద ప్రజలపై వంద శాతం ప్రభావం పడింది.
– చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్