న్యూఢిల్లీ/లక్నో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగు పెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర లిఖించుకున్న శుభాన్షు శుక్లా (39).. 1984లో రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా నిలిచారు. తన అభిమాన హీరో రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర జరిపిన మరుసటి ఏడాది 1985 అక్టోబర్ 10న లక్నోలో జన్మించిన శుక్లా.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో చేరడానికి ముందు లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తిచేసి, 2006లో భారత వాయుసేన (ఐఏఎఫ్)లో చేరారు.
ఐఏఎఫ్‌లో పదేండ్లకుపైగా కెరీర్ కొనసాగించిన ఆయనకు ఎస్‌యూ-30 ఎంకేఐ, మిగ్-29, జాగ్వార్, డార్నియర్-228 తదితర విమానాలను 2 వేల గంటలకుపైగా నడిపిన అనుభవం ఉన్నది. 2027లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించాలనుకుంటున్న తొలి మానవ సహిత రోదసి యాత్ర ‘గగన్‌యాన్’ కోసం తన సహ టెస్ట్ పైలట్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్‌తో కలిసి 2019లో భారత వ్యోమగామి దళానికి ఎంపికైన శుభాన్షు శుక్లాను సహచరులు ముద్దుగా ‘షుక్స్’ అని పిలుస్తుంటారు.
ప్రయాణానికి ముందు శుభాన్షు తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు. ఆమె తల్లి ఆయనకు చక్కెర, పెరుగు కలిపిన పదార్ధాన్ని వర్చువల్‌గా తినిపించారు. తన కుమారుడి రోదసి యాత్రపై మీడియా ముందు మాట్లాడిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘మా కుమారుడి యాత్రపై ఎంతమాత్రం భయపడటం లేదు. ఇది మాకు ఎంతో గర్వంగా ఉంది’ అని అన్నారు. మరోవైపు తన భార్య కామ్నాను ఉద్దేశించి శుభాన్షు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. తనకు అద్భుతమైన జీవిత భాగస్వామిగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పిన ఆయన.. ఆమె లేకుండా ఏదీ సాధ్యం కాదని అన్నారు.