న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని, నకిలీ నోట్లకు చెక్ పడుతుందని బీజేపీ సర్కార్ చేసిన ప్రకటనలు బూటకమని తేలింది. దేశంలో నకిలీ నోట్ల చెలామణీ పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ కరెన్సీ నోట్ల గుర్తింపు 202526లో 5.7 శాతం పెరిగిందని, ముఖ్యంగా రూ. 500, రూ. 200 నోట్ల విభాగంలో నకిలీలు భారీగా పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో 2,17,396 నకిలీ నోట్లను గుర్తించగా 202526లో 2,29,746 నోట్లకు పెరిగిందని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పేర్కొన్నది.
నకిలీలలో ఎక్కువగా రూ.500 నోట్లు ఉన్నాయి. 500 రూపాయల ఫేక్ నోట్లు 20 శాతం పెరిగాయి. రూ. 2,000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవడంతో నకిలీ నోట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత ఏడాది 3,508 నకిలీ నోట్లను గుర్తించగా 202526లో 824 నోట్లను గుర్తించారు. గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 97.6 శాతం (2,24,334 నోట్లు) ఇతర బ్యాంకుల్లో గుర్తించగా, ఆర్బీఐ కేవలం 2.4 శాతం (5,412 నోట్లు) మాత్రమే గుర్తించింది. అయితే ఈ గణాంకాలలో పోలీసులు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లను చేర్చలేదు.
2026 ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న రూ. 500 డినామినేషన్ నోట్ల పరిమాణం సుమారు 11.2 శాతం పెరిగింది. ఇది భారతదేశ కరెన్సీ వ్యవస్థలో వాటి ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం సంవత్సరం క్రితం 6,34,458 లక్షల 500 నోట్లు చెలామణిలో ఉండగా, 2026 మార్చి చివరి నాటికి ఆ సంఖ్య 7,05,482 లక్షలకు పెరిగింది. విలువ పరంగా చెలామణిలో ఉన్న రూ. 500 నోట్ల విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 31.72 లక్షల కోట్ల నుండి 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.35.27 లక్షల కోట్లకు పెరిగింది.
అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 డినామినేషన్లో గుర్తించిన నకిలీ నోట్లు 20 శాతానికి పైగా పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. 2026 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల పరిమాణంలో రూ. 500 డినామినేషన్ నోట్లు 41.2 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగాయని, ఆ తర్వాతి స్థానంలో 16.1 శాతం వాటాతో రూ.10 డినామినేషన్ నోట్లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. విలువ పరంగా చూస్తే చెలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతానికి పైగా రూ. 500 డినామినేషన్ నోట్లే ఉన్నాయి.
దేశంలో కరెన్సీ డిమాండ్ నిరంతరం గణనీయంగా పెరుగుతుండడంతో ఆర్బీఐ పాలిమర్ బ్యాంక్ నోట్లను ప్రవేశపెట్టే విషయమై మళ్లీ చర్చలు ప్రారంభించింది. పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచనపై పాట్నా, ముంబైలలో జరిగిన ఇటీవలి ఆర్బీఐ రెండు బోర్డు సమావేశాలలో చర్చ జరిగినట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా తెలిసింది. సంప్రదాయ కాగితపు నోట్లకంటే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నుతాయని, అలాగే వీటి తయారీ వ్యయం కూడా తక్కువగా ఉంటుందని ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నారు.
పాలిమర్ ఆధారిత నోట్లను ఏటీఎంల ద్వారా కూడా పంపిణీ చేయవచ్చు. కేంద్ర బ్యాంకు త్వరలోనే పాలిమర్ కరెన్సీ పైలట్ ప్రాజెక్ట్ను సిద్ధం చేస్తున్నదని, ఇది త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నదని మీడియా నివేదిక హైలైట్ చేసింది. 1988లో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిసారిగా పాలిమర్ కరెన్సీని ప్రవేశపెట్టింది. 1996 నాటికి ఆ దేశం పూర్తిగా పాలిమర్ నోట్లలోకి మారిపోయింది.