ముంబై, జనవరి 17: పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని కొన్ని రాష్ర్టాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ర్టాలు పాత పెన్షన్‌పై మాట్లాడకపోవటమే మంచిదని, తిరిగి ఆ విధానాన్ని తీసుకొస్తే ఆర్థిక వ్యవస్థకు చేటు అని తెలిపింది. ఈ మేరకు ‘స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2022-23’ రిపోర్టులో ఆయా రాష్ర్టాలకు ముందు జాగ్రత్త హెచ్చరికలు చేసింది. హిమాచల్‌ప్రదేశ్ మంత్రిమండలి ఈ మధ్యే పాత పెన్షన్ విధానానికి పచ్చజెండా ఊపింది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ సహా పలు రాష్ర్టాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభిస్తామని తెలిపాయి. గత నవంబర్‌లో పంజాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే, పలు రాష్ర్టాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారా? అని కేంద్రాన్ని పార్లమెంట్లో ప్రశ్నించగా, ఆ ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేసింది.