మహిళా సీఎం సారధ్యంలోని పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో దారుణ ఉదంతం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద, సుభాష్ చంద్ర బోస్, రవీంద్ర నాథ్ ఠాగూర్ వంటి మహనీయులు జన్మించిన నేలపై ఇంతటి నీచమైన నేరం జరగడం విస్మయం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోల్‌కతాలో వైద్యరాలిపై హత్యాచార ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని, అక్కడ గూండాలు డాక్టర్లపై దాడిచేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు సరైన రీతిలో బెంగాల్ అధికారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు.
ఘటనా స్ధలంలోకి పెద్దసంఖ్యలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించి ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న తీరు అత్యంత హేయమని అన్నారు. నిందితులను కాపాడాలని కొందరు కోరుకుంటున్నారని ఈ ఘటనలతో వెల్లడవుతున్నదని చెప్పారు. ఆధారాలు చెరిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మమతా బెనర్జీ సర్కార్‌పై ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఆరోపణలు గుప్పించే బదులు పశ్చిమ బెంగాల్ సీఎం సీబీఐ బృందానికి సహకరించాలని, ఆధారాలు కాపాడేలా చొరవ చూపాలని చిరాగ్ పాశ్వాన్ హితవు పలికారు.
Read More :
KTR | రేవంత్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు.. కేటీఆర్ సెటైర్లు