‘The poor lady, the president, was getting very tired by the end.. she could hardly speak, poor thing.”
న్యూఢిల్లీ, జనవరి 31: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. శుక్రవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి పార్లమెంటు బయటకు వచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై స్పందించాల్సిందిగా మీడియా ప్రతినిధులు సోనియా గాంధీని కోరగా.. ‘పూర్ లేడీ.. ప్రసంగం చివరికి వచ్చే సరికి రాష్ట్రపతి అలిసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు. పూర్ థింగ్’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు సోనియా గాంధీ మాట్లాడుతుండగా రాహుల్ గాంధీ సైతం రాష్ట్రపతి ప్రసంగాన్ని ఉద్దేశించి ‘బోరింగ్. నో కామెంట్స్. చెప్పిందే చెప్పారు’ అని అన్నారు.
సోనియా గాంధీ వ్యాఖ్యలను రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్రపతి ఎక్కడా అలిసిపోలేదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. ‘పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు దురదృష్టకరం, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రపతి తన ప్రసంగంలో ఎక్కడా అలసిపోలేదు. పేద, అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఆమెకు అలుపనేదే రాదు. హిందీ వంటి భారతీయ భాషలు, యాసపై అవగాహన లేని వారు ఇలా తప్పుడు అభిప్రాయానికి వచ్చి ఉంటారని భావిస్తున్నాం’ అని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొన్నది.
రాష్ట్రపతిపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దళిత, ఆదివాసీ, ఓబీసీ, పేదలు పురోగతి సాధిస్తుంటే అవమానించడం రాజ కుటుంబానికి(గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) అలవాటు. ఆదివాసీ బిడ్డ ప్రసంగాన్ని విసుగు పుట్టించిందని ఆ కుటుంబసభ్యుడొకరు అన్నారు. మరొకరు ఇంకో అడుగు ముందుకేసి పూర్ థింగ్ అని వ్యాఖ్యానించారు. ఇది దేశంలోని 10 కోట్ల మంది ఆదివాసీ అక్కచెల్లెళ్లతో పాటు ప్రతి పౌరుడికీ అవమానం’ అని మోదీ పేర్కొన్నారు.
‘సోనియా గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పెత్తందారీ, పేదల వ్యతిరేక, ఆదివాసీ వ్యతిరేక స్వభావాన్ని చాటుతున్నది. రాష్ట్రపతికి, దేశంలోని ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఆదివాసీ మహిళ దేశ ప్రథమ పౌరురాలు కావడాన్ని జమిందారీ ఆలోచనావిధానం కలిగిన కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నదని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ ఆరోపించారు.