కోల్‌కతా: ఆర్జీ కర్ దవాఖానలో పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారంతో దేశమంతా అట్టుడుకడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్’ను శాసనసభలో ప్రవేశపెట్టింది. అధికార, విపక్షాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఈ బిల్లు ప్రకారం రేప్ కేసులో బాధితురాలి మరణం సంభవించినా, లేదా ఆమెను అసహాయ స్థితిలో విడిచిపెట్టినా నిందితులకు మరణ శిక్ష విధిస్తారు. దేశంలో మహిళల రక్షణకు సరైన చట్టాలను రూపకల్పన చేయలేని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మరోవైపు, ఆర్జీకర్ దవాఖాన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై బెంగాల్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
గ్యాంగ్ రేప్ చేసి.. నగ్నంగా డ్యాన్స్ చేయించి ;బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మహిళపై దారుణం
ఇండోర్, సెప్టెంబర్ 3: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌లో 34 ఏండ్ల మహిళను జూన్ 11న ఐదుగురు వ్యక్తులు ఒక గోడౌన్‌లోకి తీసుకువెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేగాకుండా ఆమెను బెల్టుతో కొడుతూ నగ్నంగా డ్యాన్స్ చేయిస్తూ రాక్షసానందం పొందా రు. బాధితురాలు దీనిపై జూలై 17న ఫిర్యాదు చేసినా కనాడియా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో సోమవారం కేసు నమోదు చేశారు. అయితే నిందితులనెవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు. కాగా, నిందితుల్లో బీజేపీ నేత ఉండటం వల్లే పోలీసులు కేసు నమోదు చేయలేదని రాష్ట్ర కాంగ్రెస్ నేత నీలబ్ శుక్లా ఆరోపించారు. దీనిని బీజేపీ ప్రతినిధి నరేంద్ర సలూజ ఖండించారు.