Maharashtra Assembly Elections : రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ (MVA) విజయం సాధిస్తుందని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ రమేష్ చెన్నితల ధీమా వ్యక్తం చేశారు. ఏక్నాథ్ షిండే సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర ప్రజలు తమను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆగస్ట్ 7న ముంబైలో ఎంవీఏ తొలి భేటీతో అధికారిక చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. తాము రేపు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నామని వెల్లడించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఎంవీఏ సీట్ల సర్దుబాటు, ముఖ్యమంత్రి అభ్యర్ధి గురించి త్వరలో ప్రకటిస్తామని రమేష్ చెన్నితల తెలిపారు. కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముంబైలోని మొత్తం 36 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. ముంబైలోని అన్ని స్ధానాల్లో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే సమాయాత్తమయ్యాయని ఆప్ ముంబై చీఫ్ ప్రీతి శర్మ మీనన్ తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను విజయవంతంగా నడుపుతున్నదని చెప్పారు. తమకు గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలున్నారని, పార్లమెంట్‌కు గణనీయ సంఖ్యలో ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. పదేండ్లలోనే ఢిల్లీ తరహా అభివృద్ధి మోడల్‌ను ఆప్ దేశానికి పరిచయం చేసిందని చెప్పారు. నాణ్యమైన విద్య, వైద్యం, మంచినీరు, విద్యుత్ సరఫరా వంటివి ఉచితంగా అందించడమే కాకుండా అవినీతి లేకుండా చూసిందని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ మోడల్‌తో ఆప్ స్వచ్ఛమైన రాజకీయాలు, నూతన రాజకీయ సంస్కృతిని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియతో ముందుకెళుతుందని ప్రీతి శర్మ పేర్కొన్నారు.
Read More :
Koppula Eshwar | ఇదెక్కడి ఇందిరమ్మ రాజ్యం..? కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కొప్పుల ఈశ్వర్