న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ) : దాదాపు 13 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభ ఆమోదం తెలియజేయడంతో వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు- 2025 శుక్రవారం పార్లమెంట్ ఆమోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాద ప్రతివాదనలు జరిగాయి. ప్రతిపక్షాలు దీన్ని ముస్లిం వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక బిల్లుగా అభివర్ణించాయి. ముస్లింలకు చెందిన ఆస్తులను చేజిక్కించుకుని వాటిని కార్పొరేషన్లకు అప్పగించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించాయి. బిల్లుతో లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని, తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. దురుద్దేశంతోనే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని, దీన్ని ఉపసంహరించాలని కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ)తోపాటు, ఇతర ప్రతిపక్షాలు డిమాండు చేశాయి. 128 మంది సభ్యులు అనుకూలంగా, 95 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. గురువారమే ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు, 2025కి కూడా రాజ్యసభ శుక్రవారం ఆమోదం తెలిపింది.
బిల్లుపై చర్చ సందర్భంగా మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బిల్లుపై ముస్లిం సమాజాన్ని భయపెడుతున్నాయని ఆరోపించారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ లక్ష్యంతో అన్ని వర్గాల కోసం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. వక్ఫ్ బోర్డు ఓ చట్టబద్ధ సంస్థని, అన్ని ప్రభుత్వ సంస్థల మాదిరిగానే అది కూడా లౌకికవాదంతో పనిచేయాలని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డులో కొద్ది మంది ముస్లిమేతరులు ఉన్నంత మాత్రాన బోర్డు నిర్ణయాల్లో మార్పులు జరగబోవని, పైగా వాటికి విలువ చేకూరుతుందని రిజిజు చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో జేపీసీ, ఇతర భాగస్వాములు చేసిన అనేక సూచనలను చేర్చామని ఆయన తెలిపారు.
వక్ఫ్ సవరణ బిల్లును సవాలు చేస్తూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు, 2025పై రాష్ట్రపతి సంతకం చేయవలసి ఉంది. ముస్లింలు, ముస్లిం సమాజానికి చెందిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా వక్ఫ్ బిల్లులోని నిబంధనలను ఒవైసీ తన పిటిషన్లో అభివర్ణించారు.
బడ్జెట్ సమావేశాలకు తెరదించుతూ పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి.
వక్ఫ్ బిల్లుపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నదని రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత, ఎంపీ సురేశ్‌రెడ్డి చెప్పారు. ఈ బిల్లు కొన్ని వర్గాలకు నష్టం చేస్తుందన్నారు. బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ అభివృద్ధి ముసుగులో ఒక వర్గాన్ని ఏకం చేసే కుట్రకు కేంద్రం తెరలేపిందన్నారు. ఈ బిల్లుపై దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల్లోని వక్ఫ్ బోర్డు బాధ్యులను చర్చలకు పిలిచి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బిల్లులో సంస్కరణలు చేయాలని సూచించారు. లేకపోతే భారత లౌకిక, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ఓ సీఎం సర్వే నిర్వహించి విద్యుత్తు, దేవాదాయ శాఖల్లో తీవ్రమైన అవినీతి ఉందని గుర్తించారని తెలిపారు. తదనంతరం అవినీతిని అరికట్టేందుకు పాలనా పరమైన సంస్కరణలు తెచ్చారని చెప్పారు. అదే తరహాలో మైనార్టీల్లో కూడా సంస్కరణలు తేవాలని ఆశిస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లింల జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో మత ఘర్షణలు, అల్లర్లు జరుగుతాయని అప్పటి సీమాంధ్ర పాలకులు చెప్పారన్నారు. అయితే కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో ఒక్కటంటే ఒక్క మత ఘర్షణ జరగలేదని, తెలంగాణ లౌకికంగా, ప్రజాస్వామికంగా ఫరిఢవిల్లిందని చెప్పారు. తెలంగాణ కోసం హిందువులు, ముస్లింలు ఏకమై పోరాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో దర్గాలకు ముస్లింలు 45 శాతం మంది వెళ్తే.. హిందువులు 55 శాతం మంది వెళ్తారని తెలిపారు. తమ పిల్లలకు పెండ్లిళ్లు కావాలని ప్రార్థిస్తుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు తేవడం ద్వారా హిందూ ముస్లింల మధ్య ఐక్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ముస్లింల దర్గాలకు హిందువులే సాదా బైనామాపై స్థలాలను రాసిచ్చేవారని చెప్పారు. అదానీ వంటి పారిశ్రామిక వేత్తలు దర్గాలను సందర్శిస్తే.. వారిచ్చే విరాళాలతో దర్గాలు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని, అయితే ఈ వక్ఫ్ బిల్లుతో విరాళాలు ఇచ్చేందుకు వెనుకాడే పరిస్థితి ఉండొచ్చని తెలిపారు. కేంద్రం వెంటనే ఈ వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు.