Parimal Nathwani : ఉత్కంఠగా సాగిన ఝార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు ఎంపీ సీట్లు పోటీ జరగగా.. ఒక స్థానం నుంచి బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వాని గెలుపొందారు. మరో సీటును జేఎంఎం సొంతం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వైద్యనాథ్ రామ్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాత్రం షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఏకైక అభ్యర్థి ప్రణవ్ ఝా.. పరిమళ్ చేతిలో ఓడిపోయారు. ఇండియా బ్లాక్ మద్దతు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయి, బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ గెలవడానికి క్రాస్ ఓటింగే కారణమని తెలుస్తోంది.
ఝార్ఖండ్‌లో మిగిలిన రెండు స్థానాల కోసం ముగ్గురు పోటీ పడ్డారు. బీజేపీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీతోపాటు కాంగ్రెస్ నుంచి ప్రణవ్ ఝా, జేఎంఎం నుంచి వైద్యనాథ్ రామ్ పోటీ పడ్డారు. ముగ్గురిలో జేఎంఎం అభ్యర్థి విజయం ముందే దాదాపు ఖాయమైంది. ఎందుకంటే ఆయన గెలిచేందుకు 28 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. కానీ, ఆ పార్టీకి 34 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే.. మెజారిటీకంటే 6 ఓట్లు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి, జేఎంఎం అభ్యర్థి వైద్యనాథ్ గెలుపు లాంఛనమే. ఇక, అసలు పోటీ జరిగింది మాత్రం ప్రణవ్ ఝా, పరిమళ్ నత్వానీ మధ్యే. కాంగ్రెస్ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలున్నారు. జేఎంఎం నుంచి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఆర్జేడీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా గెలవాలంటే మరో నాలుగు ఓట్లు మాత్రమే అవసరం. మిగిలిన ఏకైక అభ్యర్థి పరిమళ్ నత్వాని.
ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే, ఆయనకు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి అండగా నిలిచింది. ఈ కూటమికి 24 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే.. అటు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా గెలవాలన్నా, ఇటు పరిమళ్ గెలవాలన్నా మరో 4 ఓట్లు అవసరం. దీనికి నలుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వాలి. ఈరోజు జరిగిన ఎన్నికలో పరిమళ్ గెలుపొందారు. అంటే, ఆయనకు కాంగ్రెస్ నుంచి కానీ లేదా జేఎంఎం నుంచి కానీ మద్దతు లభించి ఉండాలి. ఇండియా బ్లాక్ ఎమ్మెల్యేల్లో కొందరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో బీజేపీ మద్దతు ఇచ్చిన పరిమళ్ గెలుపొందారు.