తిరువనంతపురం, సెప్టెంబర్ 20: కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌పై అధికార సీపీఎం తీవ్ర ఆరోపణలు చేసింది. గవర్నర్ బీజేపీ, ఆరెస్సెస్ ఆదేశాలతో పనిచేస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మంత్రులు ఎంబీ రాజేశ్, థామస్ ఇసాక్ మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ-ఆరెస్సెస్ విధానాలను అమలు చేసేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని, గతకొద్ది రోజులుగా ఆయన ప్రవర్తన చూస్తే ఇది అర్థం అవుతున్నదని ఆరోపించారు.
కర్ణాటక, గోవాలో చేసినట్టుగా కేరళలో లెఫ్ట్ ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పకోలేమన్న విషయం బీజేపీకి తెలుసునని, అందుకే రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని ఎంబీ రాజేశ్ మండిపడ్డారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకొని బీజేపీ సమస్యలు సృష్టిస్తున్నదని ఇసాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన యూనివర్సిటీ బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లులకు తాను ఆమోదం తెలుపనంటూ.. అసలు ఆ బిల్లును చూడకుండానే చెప్పడం, ముందుగానే నిర్ణయించుకున్న మనస్తత్వాన్ని సూచిస్తున్నదని మంత్రులు ఆక్షేపించారు.