న్యూఢిల్లీ, జూన్ 28: కేటాయించిన సీట్లలో పావు శాతం కూడా గెలవకుండా మిత్ర పక్షాలను పరోక్షంగా అధికారానికి దూరం చేస్తున్న కాంగ్రెస్.. యూపీలోనూ అదే పంథా అనుసరిస్తున్నది. మిత్రపక్షం సమాజ్వాదీ పార్టీతో సమానంగా సీట్లు కేటాయించాలని కోరుకుంటున్నది. యూపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమితులైన రాజేంద్ర పాల్ గౌతమ్ ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్పీతో సమానంగా కాంగ్రెస్కు సీట్లను కేటాయించాలని వ్యక్తిగతంగా తాను కోరుకుంటున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. కాగా, ఈ రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపునకు సంబంధించి ఎలాంటి అధికారిక చర్చలు ప్రారంభం కాలేదు. 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో రాబోయే ఎన్నికల్లో 150 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతున్నది. అయితే 70-80 సీట్లకు మించి ఇవ్వడానికి ఎస్పీ ఇష్టపడకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగానే సగం సీట్లను డిమాండ్ చేస్తే తాము కోరిన 150 సీట్లను ఎస్పీ కేటాయించవచ్చుననేది కాంగ్రెస్ వ్యూహంగా కనపడుతున్నది.