తిరువనంతపురం, మార్చి 24: కేరళ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర పరిశీలకుడిగా హాజరైన ప్రహ్లాద్ జోషి ఇక్కడ జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన పేరును వెల్లడించారు. రాష్ర్టానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు, రాష్ట్ర ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ నుంచి అధ్యక్ష బాధ్యతల్ని చంద్రశేఖర్ అందుకున్నారు.
ఈ సందర్భంగా సురేంద్రన్ మాట్లాడుతూ, గత 10 ఏండ్లలో కేరళలో బీజేపీ పెద్ద ఎత్తున విస్తరించిందని అన్నారు. పార్టీ నాయకులంతా చంద్రశేఖర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తిరువనంతపురం స్థానంలో పోటీ చేసిన చంద్రశేఖర్, శశిథరూర్ చేతిలో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.