Rajasthan : ప్రభుత్వ పాఠశాలలో నీళ్లు తాగిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 13 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన రాజస్థాన్, బర్మార్ జిల్లా, సనావాడ పరిధి, మేఘ్వాలోంకి బస్తిలోని సీనియర్ సెకండరీ పాఠశాలలో జరిగింది.
శనివారం ఉదయం కొందరు విద్యార్థులు స్కూల్లో ఒక కార్యక్రమం కోసం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కూల్లోని వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నీళ్లు తాగారు. అయితే, కొద్దిసేపటికే ఈ నీళ్లు తాగిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 13 మంది విద్యార్థులు ఒళ్లంతా దురద, దద్దుర్లతో తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది ఆ విద్యార్థుల్ని దగ్గర్లోని సనావాడలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకున్నప్పటికీ, అక్కడ వారి పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో విద్యార్థుల్ని బర్మార్ మెడికల్ కాలేజీకి తరలించారు.
ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందుతోంది. జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజేంద్ర సింగ్ విద్యార్థుల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విద్యార్థులు అలర్జీ వంటి అనారోగ్య లక్షణాలకు గురయ్యారని, ప్రస్తుతం వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని లేదన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.