జైపూర్: అనుమానాస్పద వాహనం స్పీకర్ కారును ఛేజ్ చేసింది. (Speaker’s Car Chased) జాతీయ రహదారిపై కొంత దూరం వరకు వెంబడించింది. ఆ కారులో ఉన్న వారు స్పీకర్ వాహనాన్ని ఫొటోలు తీశారు. గమనించిన ఎస్కార్ట్ సిబ్బంది పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో భద్రత కోసం పలు పోలీస్ వాహనాలు తరలివచ్చాయి. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నానీ మంగళవారం జైపూర్ నుంచి అజ్మీర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వావాహనం ఆయన కారును వెంబడించింది. ఆ వాహనంలో నలుగురు యువకులున్నారు. హైవేపై కొంతసేపు స్పీకర్ కారును అనుసరించారు. తమ మొబైల్ ఫోన్లలో స్పీకర్ కారు ఫొటోలు, వీడియోలు తీశారు.
కాగా, స్పీకర్ వాసుదేవ్ దేవ్నానీ కారును అనుమానాస్పద వాహనం వెంబడించడాన్ని ఎస్కార్ట్ సిబ్బంది గమనించారు. వెంటనే పోలీసులను అలెర్ట్ చేశారు. దీంతో పోలీస్ వాహనాలు అక్కడకు చేరుకున్నాయి. స్పీకర్ కారుకు భద్రతగా నిలిచాయి. స్పీకర్ సురక్షితంగా అజ్మీర్ చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వాహనం వెంబడించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.