జైపూర్: ప్రజలు తన మాట వినకపోవడంతోనే మంత్రివర్గం నుంచి తప్పుకున్నానని రాజస్థాన్ మాజీ మంత్రి, బీజేపీ నేత కిరోడి లాల్ మీనా (Kirodi Lal Meena) అన్నారు. గత 45 ఏండ్లుగా తాను ప్రజలకు సేవచేస్తున్నానని, అయినప్పటికీ వారు తన మాట పట్టించుకోవడం లేదని చెప్పారు. సీఎం భజన్‌లాల్ శర్మ మంత్రివర్గంలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మీనా.. జూలైలో తన పదవికి రాజీనామా చేశారు. అయితే దానికి గాల కారణాలను నెల రోజుల తర్వాత వెల్లడించారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఇన్చార్జిగా ఉన్న ఏ సీట్లలో పార్టీ ఒక్కచోట ఓడిపోయినా తన మంత్రిపదవికి రాజీనామా చేస్తానని ఎన్నికల సందర్భంగా ప్రకటించారు.
దౌసా, భరత్పూర్, కరౌలి-ధోల్పూర్, అల్వార్, టూంక్ సవాయి మాధోపూర్, కోటా-బండి, జైపూర్ రూరల్ స్థానాలకు ఆయన ఇన్చార్జిగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో దౌసా, భరత్పూర్, కరౌలి-ధోల్పూర్, టూక్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. అయితే తాజాగా ప్రజలు తన మాట వినకపోవడంతోనే రాజీనామా చేశానని ప్రపంచ ఆదివాసి దినోత్సం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారనే వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు.