Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు హైస్పీడ్ రైళ్లను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నది. అయితే, ప్రస్తుతం ఈ రైళ్ల వేగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెమీహైస్పీడ్ రైళ్లను గతంలో ప్రకటించిన వేగంతో నడపడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వందే భారత్ రైళ్ల వేగంపై వస్తున్న ప్రశ్నలకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. రైలు వేగం తగ్గడానికి గల కారణాలను వెల్లడించారు. పార్లమెంట్లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
హైస్పీడ్ రైలు సగటు వేగం ఎందుకు తక్కువగా ఉందని.. ప్రభుత్వ ప్రణాళిక.. రైలు వేగంతో నడిపేందుకు ఏం చర్యలు తీసుకున్నారు.. పూర్తిస్థాయి వేగంతో నడిపేందుకు ఎంత సమయం పడుతుందని పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రైలు వేగం ఇంజిన్‌పై మాత్రమే ఆధారపడి ఉండదని రైల్వే మంత్రి పేర్కొన్నారు. రైలు నడిచే ట్రాక్‌పై సైతం ఆధారపడి ఉంటుందని.. రైల్వేలైన్లను మెరుగుపరిచే పని నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. 2014 సంవత్సరంలో రైళ్లు గంటకు 110 కిలోమీటర్లు.. అంతకంటే ఎక్కువ వేగంతో 31వేలకుపైగా కిలో మీటర్ల ట్రాక్‌లో మాత్రమే నడవగలమని చెప్పారు. ప్రస్తుతం 80వేల కిలోమీటర్లకు పెంచామన్నారు. ప్రస్తుతం అంత పరిధిలో మాత్రమే పూర్తిస్థాయి వేగంతో నడవగలవమన్నారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో నడిచే సామర్థ్యం ఉంది. కొంతకాలం కిందట ట్రయల్స్‌లో భాగంగా రైలును దాదాపు 180 కిలోమీటర్ల వేగంతోనూ దూసుకెళ్లింది. అయితే, ఇటీవల హైస్పీడ్ రైళ్ల వేగంగాపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 136 వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. భారత్‌లో అత్యధిక వేగంతో నడిచే రైళ్లలో వందే భారత్ ఒకటి. వందే భారత్ రైళ్లకు ప్రస్తుతం ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. కొన్ని చోట్ల మినహా మిగతా అన్ని రైట్లలో ఆక్యుపెన్సీ భారీగానే ఉన్నది.