న్యూఢిల్లీ : ప్రయాణికుల సౌకర్యార్థం..8 గంటల ముందుగా రైల్వే రిజర్వేషన్ జాబితాను విడుదల చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. దశల వారీగా దీనిని దేశమంతటా అమలుజేయబోతున్నట్టు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. కాగా, జూలై 1 నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్‌లో తత్కాల్ టికెట్స్‌ను బుక్ చేసుకోవడానికి ఆధార్ ఆథెంటికేషన్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు రైల్వే రిజర్వేషన్ చార్ట్‌ను అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల రైలు ప్రయాణం సందిగ్ధతలో పడుతున్నది.
ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్ పరిమితిని అన్ని ఏసీ తరగతులకు 25 నుంచి 60 శాతానికి, నాన్ ఏసీ తరగతుల్లో 30 శాతానికి పెంచుతున్నట్టు రైల్వే శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. సవరించిన సీఆర్ఐఎస్ (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం) ఉత్తర్వులు జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏప్రిల్ 17న జారీచేసిన సీఆర్ఐఎస్ ఉత్తర్వుల ప్రకారం, అన్ని తరగతుల్లో ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్ పరిమితిని 25 శాతానికి పరిమితం చేశారు.