Dheeraj Sahu | రాంచీ, డిసెంబర్ 11: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ కంపెనీలపై ఐటీ శాఖ చేసిన దాడుల్లో వందల కోట్ల రూపాయలు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. నోట్ల కట్టలను లెక్కించేందుకు ఏకంగా 50 మంది సిబ్బంది, 40 కౌంటింగ్ మెషీన్లను వినియోగించారు. నాలుగు రోజులపాటు లెక్కించగా రూ.350 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు బయటపడింది. కట్ట కట్టల డబ్బును లెక్కించలేక మెషీన్లు కూడా మొరాయించాయి. ఈ క్రమంలో అసలు ఎవరీ ధీరజ్ సాహూ, ఆయన నేపథ్యం ఏమిటన్నది ఓసారి చూద్దాం..
తండ్రి అలా.. కొడుకు ఇలా..
ధీరజ్ తండ్రి బల్దేవ్ స్వాతంత్య్ర సమరయోధుడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆయన భారత ప్రభుత్వానికి రూ.47 లక్షల నగదు, 47 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ధీరజ్‌తోపాటు ఆయన మరో నలుగురు సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. వీరిలో ఒకరైన శివప్రసాద్ సాహూ రాంచీ నుంచి కాంగ్రెస్ తరఫున రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈయన ఇందిరాగాంధీకి సన్నిహితుడిగా పేరు పొందారు. ఇంకో ఇద్దరు సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ధీరజ్ సాహూ చత్రా నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసినా ఓడిపోయారు. 2009 జూన్‌లో రాజ్యసభ ఉప ఎన్నికల్లో గెలిచిన ఆయన.. 2010 జూలైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. 2018లో మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. సాహూ కుటుంబం జార్ఖండ్‌లోని లోహర్‌దంగా, దాని చుట్టుపక్కల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో మద్దతుగా నిలిచింది. ఈ కారణంగా వీరి పూర్వీకుల ఇంటిని లోహర్‌దంగా వైట్ హౌస్ అని పిలిచేవారు. ఈ ఇంటికి సినీ తారలు, క్రికెటర్లు కూడా వచ్చేవారు. ధీరజ్ సాహూ కుటుంబం ప్రధానంగా మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నది. వీరి కంపెనీలు ఎక్కువగా ఒడిశాలోనే ఉన్నాయి.
అఫిడవిట్లో పేర్కొన్నది రూ.34 కోట్లు
2018లో ఎన్నికల సంఘానికి ధీరజ్ సాహూ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.34 కోట్ల పైనే. ఆయనకు నాలుగు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఆయన వార్షికాదాయం సుమారు రూ.1 కోటి ఉంటుందని అంచనా. ఆయనకు రూ.26.16 లక్షల విలువైన వజ్రాభరణాలు, ఆయన భార్యకు రూ.3.1 కేజీల బంగారం ఉన్నట్టు తెలిసింది. కుటుంబ కంపెనీల్లో రూ.4 కోట్ల పెట్టుబడులు పెట్టిన సాహూ ఢిల్లీలో ఒక విల్లా కొనుగోలు కోసం రూ.2 కోట్ల అడ్వాన్స్ చెల్లించారు.
డబ్బును వేగంగా లెక్కించే మెషీన్లు కనిపెట్టండి ; ఐఐటీ ధన్‌బాద్ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహు ప్రాంగణాలపై ఆదాయ పన్నుశాఖ జరిపిన దాడుల్లో వందల కోట్ల డబ్బు బయటపడింది. ఐటీ అధికారులు, బ్యాంకు సిబ్బంది మెషీన్లతో రోజుల తరబడి లెక్కిస్తున్నా ఇంకా గుట్టలుగుట్టలుగా నోట్ల కట్టలు పడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐటీ ధన్‌బాద్ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) 43వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. నగదును వేగంగా లెక్కించే మెషీన్లు కనుగొనాలని సూచించారు. ధీరజ్ సాహూ కంపెనీల్లో దొరికిన డబ్బును లెక్కిస్తున్న బ్యాంకు సిబ్బంది అవస్థలు చూసి తానీ సూచన చేసినట్టు చెప్పారు.