ఇంఫాల్, జూన్ 29: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం చేపట్టిన మణిపూర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయనపై గ్రెనేడ్ దాడి జరగొచ్చన్న అనుమానాల నేపథ్యంలో బిష్ణుపూర్‌లో కాన్వాయ్‌ను పోలీసులు గంటల పాటు నిలిపేశారు. రాహుల్ పర్యటనకు అనుకూలంగా, ప్రతికూలంగా కొందరు నినాదాలు చేయడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దీంతో హెలికాప్టర్లో చురాచాంద్‌పుర్‌కు వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నట్టు పోలీసులు తెలిపారు. పునరావాస శిబిరాల్లోని ప్రజలను పరామర్శించాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. మరోవైపు సాయుధ మిలిటెంట్లు కాంగ్పోక్పీ జిల్లాలోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం కాల్పులు జరిపారు. ఇందులో ఒక మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.