న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా మంగళవారం ఇండియా కూటమి నిరసన ప్రదర్శన జరుగుతున్న సమయంలో కూటమి భాగస్వాములకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సెంట్రల్ ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం సమీపంలో ఉన్న ఆకాశవాణి భవన్‌లోకి ఆకస్మికంగా ప్రవేశించడం విపక్ష శ్రేణులలో ఆందోళనను రేకెత్తించింది. ఈ ఉమ్మడి ప్రదర్శన కేవలం ‘అన్నాచెల్లెలి’ సొంత ప్రదర్శనగా మారిపోయిందని కొందరు మిత్రపక్షాల నాయకులు భావిస్తున్నారు.
ఆకాశవాణి భవన్‌లోకి వెళ్లాలని తాము హఠాత్తుగా నిర్ణయించుకోవడం వల్లే కూటమి భాగస్వామ్య పక్షాలకు సకాలంలో సమాచారం అందించలేకపోయామని కాంగ్రెస్ నాయకులు కొందరు వ్యక్తిగతంగా అంగీకరించారు. తమ చర్య వల్ల మిత్రపక్షాల మధ్య కలిగిన అనుమానానికి తాము చింతిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. రాహుల్, ప్రియాంక ఆకాశవాణి భవన్లో ధర్నా చేస్తున్నారన్న సమాచారం వ్యాపించడంతో కూటమిలోని వివిధ పార్టీల మధ్య ఫోన్ కాల్స్ మొదలయ్యాయి.
తృణమూల్ కాంగ్రెస్(మమత వర్గం) తమ ఎంపీ డెరెక్ ఓబ్రియన్‌ను ఆకాశవాణి భవన్‌కు పంపగా సమాజ్‌వాదీ పార్టీ రాంపూర్ ఎంపీ మెహిబ్లు నద్వీని పంపింది. ఈ నిరసన కార్యక్రమం రాహుల్, ప్రియాంక గాంధీల సొంత ధర్నాగా మారిపోయిందని కూటమి భాగస్వామ్య పక్షాలు భావించాయి. ఇండియా కూటమి నిరసన పూర్తిగా ఎన్నికల సంఘం, సీఈసీకి వ్యతిరేకంగా సాగుతుండగా, వారితో సమావేశం కావాలని డిమాండ్ చేయడం సబబేనా అని కొందరు నాయకులు ప్రశ్నించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముందుగా ప్రణాళికాబద్ధంగా నిరసనలు చేపట్టడం కష్టమని, నిరసనల్లో కొత్తదనాన్ని కొనసాగించడానికి ఆకస్మిక చర్యలు అవసరమని కొందరు కాంగ్రెస్ నాయకులు వాదించారు.