Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం (Union govt) పై కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ (Lok Sabha) లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే బీజేపీ సర్కారు ఎన్నికల కమిషన్‌ను వాడుకుంటోందని విమర్శించారు. ఎన్నికల సంస్కరణల (Electoral Reforms) పై ఇవాళ లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఈసీని కాపాడేందుకు ఏకంగా చట్టాలనే మార్చేశారని రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పథకం ప్రకారమే తప్పు చేసినా శిక్ష అనుభవించకుండా తప్పించుకునే అవకాశాన్ని ఈసీకి కల్పించారని ఆరోపించారు. ఓట్ల చోరీకి సంబంధించి తమవద్ద అనేక ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్రానికి మూడు ప్రశ్నలు వేశారు.
అందులో మొదటి ప్రశ్న.. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి ఎందుకు బలహీనపడుతోంది..? దాని స్వతంత్రతను నిర్ధారించే యంత్రాంగాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తుందా..? రెండో ప్రశ్న.. ఎస్ఐఆర్ ప్రక్రియపై అనేక రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతున్న వేళ ఓటర్ల జాబితాలను తారుమారు చేయకుండా నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? మూడో ప్రశ్న.. ఈసీ నియామకాలు, నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఎందుకు కనిపిస్తున్నాయి..? ఈ విషయంలో పారదర్శక సంస్కరణలు చేపట్టడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా..? ఈ మూడు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా అధికారిక బీజేపీకి అనుకూలంగా ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. పోలింగ్ తర్వాత 45 రోజులకు సీసీ ఫుటేజీ ధ్వంసం చేయాలనే నిబంధన ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలన్నీ ప్రజల ముందుకు తీసుకువచ్చినప్పటికీ వాటిపై ఈసీ తమకు సమాధానం ఇవ్వలేదని చెప్పారు. హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిల్‌కు చెందిన మోడల్‌కు 23 ఓట్లు ఉన్న అంశాన్ని మళ్లీ గుర్తుచేశారు.
మరోవైపు ఆర్ఎస్ఎస్ (RSS) పైనా రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ ఒక్కొక్కటిగా అన్ని వ్యవస్థలను కబ్జా చేస్తోందని విమర్శించారు. దేశంలోని వ్యవస్థలు అన్నిటిపైనా ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపిస్తోందని మండిపడ్డారు.