Rahul Yatra | రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం దొరికింది. జమ్ములో భారీ వర్షం కారణంగా పాదయాత్ర ముందుకు కొనసాగలేదు. ఇవాల్టి యాత్రను క్యాన్సిల్ చేశారు. గురువారం రిపబ్లిక్ డే సందర్భంగా విరామం ఉంటుంది. పాదయాత్ర తిరిగి 27 న కొనసాగించనున్నారు. బుధవారం బనీహాల్ నుంచి రాహుల్ తన యాత్రను ప్రారంభించాల్సి ఉన్నది.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఇవాళ 131వ రోజుకు చేరింది. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో వర్షంలోనే నడక సాగించారు. భారీ వర్షాలకు తోడు కొండచరియలు కూడా విరిగిపడటంతో పలు రహదారులు మూసుకుపోయాయి. దాంతో బుధవారం నాటి యాత్రను రద్దు చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్వీట్ ద్వారా తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున జోడో యాత్రకు విరామం ఉంటుందని, తిరిగి మరుసటిరోజు జనవరి 27న ఉదయం 8 గంటల నుంచి యాత్ర ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం, బుధవారం యాత్ర ఖోబాగ్ ప్రాంతంలో నిలిచిపోవాలి. అయితే, ఒకరోజు యాత్రను రద్దు చేసినప్పటికీ ముందుగా తెలిపిన ప్రకారంగానే శ్రీనగర్ చేరుకోని జనవరి 30 న ముగుస్తుంది. దాదాపు 270 కిలో మీటర్ల జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాహుల్ పాదయాత్ర సవాల్‌గా కొనసాగనున్నది. గత ఏడాది సెప్టెంబర్ 7 న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ తన భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 12 రాష్ట్రాల్లో 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనున్నది.