న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి సరైన రీతిలో సెక్యూర్టీ కల్పించడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన తీవ్ర ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను సీఆర్పీఎఫ్ ఖండించింది. ఇటీవల అనేక సార్లు రాహుల్ గాంధీయే సెక్యూర్టీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఆయనకు ఎప్పటికప్పుడు తెలియజేసినట్లు కూడా సీఆర్పీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
2020 నుంచి రాహుల్ గాంధీ 113 సార్లు సెక్యూర్టీ ఆంక్షలను ఉల్లంఘించినట్లు కేంద్ర రిజర్వ్ బలగాల శాఖ తెలిపింది. ఢిల్లీలో భారత్ జోడో యాత్ర సాగుతున్న సమయంలో.. రాహుల్ గాంధీయే సెక్యూర్టీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు పేర్కొన్నది. మార్గదర్శకాల ప్రకారం సహకరిస్తేనే రాహుల్కు రక్షణ ఉంటుందని సీఆర్పీఎఫ్ తెలిపింది.
డిసెంబర్ 24వ తేదీన ఢిల్లీలో జరిగిన భారత్ జోడో యాత్రలో సెక్యూర్టీ ఉల్లంఘన జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసింది. యాత్రకు వచ్చిన భారీ జనాన్ని పోలీసులు ఆపలేకపోయినట్లు ఆ లేఖలో కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ప్రస్తుతం రాహుల్కు జెడ్ ప్లస్ క్యాటగిరీ రక్షణ ఉన్న విషయం తెలిసిందే.