Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల్ని మళ్లీ ఈ ప్రభుత్వం కట్టెలపొయ్యివైపు నడిపిస్తోందని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. పీఎంయూవై (ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన) పథకం కింద పేదలకు కేంద్రం సబ్సిడీపై గృహ సిలిండర్లు అందజేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఈ పథకం కింద అర్హులైన కుటుంబానికి ఏడాదికి తొమ్మిది సిలిండర్లను అందించేది. ఇప్పుడు ఈ సంఖ్యను కేంద్రం నాలుగు సిలిండర్లకు తగ్గించింది. ఏడాదికి నాలుగుకు మించి సిలిండర్లు వాడాల్సి వస్తే సబ్సిడీ ఉండదు. మార్కెట్ ధర చెల్లించాల్సిందే. ఇటు ఒక పక్క సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించిన కేంద్రం మరోవైపు సిలిండర్ ధరను మూడు నెలల్లో రూ.89 పెంచింది. దీనిపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, విదేశీ విధానాల వల్ల కోట్లాది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గ్యాస్ సబ్సిడీ సిలిండర్ల తగ్గించడం వల్ల ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యిపై వంట చేసుకునే పరిస్థితి వచ్చిందని రాహుల్ విమర్శించారు.
12 वर्षों की गरीब-विरोधी आर्थिक नीतियों और compromised विदेश नीति ने आज देश को ऐसे हालात में ला खड़ा कर दिया है जहाँ लाखों गरीब परिवारों और महिलाओं को लकड़ी के ज़हरीले धुएं की तरफ धकेल दिया गया है।
उज्ज्वला योजना में सब्सिडी वाले सिलेंडरों की संख्या 9 से घटाकर 4 कर दिया गया।…
— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2026
పేదల్ని ఇంకా వెనక్కి నెడుతున్నారన్నారు. 12 ఏళ్లుగా కేంద్రం అనుసరిస్తున్న పేదల వ్యతిరేక ఆర్థిక విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ముందుగా కేంద్రం ధరల్ని పెంచుతుందని, తర్వాత సబ్సిడీ ఎత్తివేస్తుందని విమర్శించారు. పేద ప్రజల స్టవ్‌లను కేంద్రం ఆర్పివేస్తోందన్నారు. వలస వెళ్లిన కార్మికులు ఎక్కువగా వాడే 5 కేజీల సిలిండర్ ధరను పెంచడాన్ని కూడా రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కార్మికులపై ఆర్థిక భారం పడుతుందని, ఈ ఖర్చుల్ని వారు భరించలేరని ఆయన అన్నారు. కార్మికులు, రైతులు, మహిళలు, మిడిల్ క్లాస్ ప్రజలు ఈ ధరల్ని భరించలేకపోతున్నారని రాహుల్ వివరించారు.