Rahul Gandhi : ప్రధాని మోదీ లక్ష్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇటలీ పర్యటనలో ఉన్న మోదీ.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనితో మెలోడి చాక్లెట్లతో రీల్ చేయడాన్ని రాహుల్ గాంధీ తప్పుబట్టారు. మోదీది నాటకాలే అని, అది నాయకత్వం కాదని విమర్శించారు. ఇటలీలో మోదీ.. మెలోనికి చాక్లెట్లు గిఫ్టుగా అందించిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ, బీజేపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంటే ప్రధాని మోదీ ఇటలీ వెళ్లి మెలోడి చాక్లెట్లు ఇస్తున్నారని రాహుల్ విమర్శించారు. ‘‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతోంది. కానీ, ప్రధాని మోదీ ఇటలీలో టాఫీలు పంచుతున్నారు. దేశంలో యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లు ఏడుస్తుంటే ప్రధాని మోదీ మాత్రం విదేశాల్లో నవ్వుతున్నారు. రీల్స్ చేస్తున్నారు. బీజేపీ నేతలు ఇది చూసి చప్పట్లు కొడుతున్నారు. ఇది నాయకత్వం కాదు. నాటకం” అని రాహుల్ విమర్శించారు. అంతకుముందు తన లోక్‌సభ నియోజకవర్గమైన రాయ్‌బరేలిలో జరిగిన ఒక సభలో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ద్రోహులుగా అభివర్ణించారు.
అయితే, రాహుల్ గాంధీ విమర్శలపై బీజేపీ మండిపడింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మానసిక స్థిరత్వం కోల్పోతున్నారని విమర్శించారు. మోదీపై, అమిత్ షా పై విమర్శలు చేసినందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు నియంత మనస్తత్వానికి నిదర్శనం అన్నారు. ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుండటంపై రాహుల్ నిరాశ, నిస్పృహలో ఉన్నారని నబిన్ అన్నారు. ప్రధాని మోదీని విమర్శించడమంటే 140 కోట్ల దేశ ప్రజల్ని అవమానించినట్లే అని నబిన్ అభిప్రాయపడ్డారు.