Operation Sindoor | న్యూఢిల్లీ, మే 17: ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టే సమయంలో తాము ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన ప్రకటనను లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తీవ్రంగా తప్పుపట్టారు. అటువంటి చర్యకు ఎవరు ఆదేశాలు ఇచ్చారని, దీని ఫలితంగా ఎన్ని యుద్ధ విమానాలను భారత్ నష్టపోయిందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి వీడియోను ట్యాగ్ చేశారు.
కాగా, రాహుల్ గాంధీ ఆరోపణను వాస్తవాల వక్రీకరణగా విదేశాంగ శాఖ అభివర్ణించింది. ‘దాడిని మొదలు పెట్టే సమయంలో పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వడం నేరం. భారత ప్రభుత్వం ఆ పని చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రి బహిరంగంగా ఒప్పుకున్నారు. ఈ చర్యకు ఎవరు ఆదేశించారు? దీని ఫలితంగా మన వైమానిక దళానికి చెందిన ఎన్ని విమానాలను నష్టపోయాం’ అని రాహుల్ ప్రశ్నించారు.
రాహుల్ ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండిస్తూ ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైన తర్వాత తొలి దశలో జైశంకర్ పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చారని తెలిపింది. మొదలు పెట్టినపుడు అంటే అర్థం తొలి దశలో అని ఈఏఎం వివరణ ఇచ్చింది. కాగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా మంత్రి ప్రకటనను రాహుల్ వక్రీకరించారని పేర్కొంది.