Rahul gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ లోక్‌సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ‘కొన్ని రోజుల క్రితం నన్ను కలవడానికి మణిపూర్ నుంచి ఓ నేత వచ్చారు. చాలా కోపంతో ఊగిపోయారు. దీంతో నేను స్పందించాను. ఎందుకు కోపంగా ఉన్నారని అడిగాను. నా పరువు ఎన్నడూ ఇంతలా పోలేదని ఆయన సమాధానమిచ్చారు. ఆయన కొన్ని రోజుల క్రితం అమిత్‌షా ఇంటికి వెళ్లారు. అయితే అక్కడి సిబ్బంది బూట్లు తీయమని తనను ఆదేశించారు. లోపలికి వెళితే మాత్రం అమిత్‌షా చెప్పులతోనే ఉన్నారు. చెప్పులతోనే తిరుగుతున్నారు. అమిత్‌షా మాత్రం ఇంటి లోపల చెప్పులతో తిరగవచ్చు… బయటి వ్యక్తులు మాత్రం బూట్లు తీసేసి లోపలికి వెళ్లాలా? ఇంతలా భేదభావం ఎందుకు చూపిస్తున్నారు? ఇదేం పద్ధతి?’ అంటూ రాహుల్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.