Conrgress Party Cheif | కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికల వేడి పెరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి తదుపరి అధ్యక్షులు ఎవరన్న సంగతి ఇప్పటికీ తేలలేదు. ఈ బాధ్యతలు స్వీకరించేలా రాహుల్‌గాంధీని ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టడానికి నిరాసక్తతతో ఉన్నారని సమాచారం. ఆరోగ్య కారణాల రీత్యా, అధ్యక్షురాలిగా కొనసాగేందుకు సోనియాగాంధీ కూడా విముఖంగా ఉన్నారని సమాచారం. ఇక అందరి కండ్లూ ప్రియాంక గాంధీ వద్రా వైపు మళ్లాయి. కానీ, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆమె ఆ బాధ్యతలు చేపట్టడంపై సందేహాలు కమ్మకున్నాయి.
ఈ పరిస్థితుల్లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (71)తోపాటు మరికొందరు ఇతర నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే 1998 తర్వాత తొలిసారి గాంధీకుటుంబేతర సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించనున్నారు. ఆదివారం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం అవుతున్నా.. దానిపై అనిశ్చితి కొనసాగుతున్నది. పార్టీ కూడా అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన చేయడం లేదు.
`అవును ఆయన (రాహుల్‌గాంధీ) ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి లేదని చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆయన కోరుతున్నాం. ఆ పదవికి నేతను ఎలా ఎంపిక చేయాలో రాహుల్ మాకు చెప్పారు` అని కాంగ్రెస్ సీనియర్ నేత భక్తచరణ్ దాస్ తెలిపారు. అయినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రచారానికి సారధ్యం వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే నెలలో కన్యా కుమారి నుంచి `భారత్ జోడో యాత్ర` ప్రారంభంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. `అవును మేం భారత్ జోడో యాత్ర ప్రారంభం సందర్భంగా సభ ఏర్పాటు చేస్తున్నాం. సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అధ్యక్ష ఎన్నికల గురించి మేం హామీ ఇవ్వలేం` అని హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా చెప్పారు.
సీనియర్ నేతల నిష్కమణ, ఎన్నికల్లో వరుస పరాజయాలతో ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్, ప్రియాంకలతోపాటు తానూ తప్పుకునేందుకు సిద్ధం అని సోనియాగాంధీ గత మార్చిలో ప్రకటన చేశారు. తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొనసాగేందుకు సోనియాగాంధీ అంగీకరించారు.