Loksabha Elections 2024 : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ యూపీలోని అమేథిలో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్ధి కేఎల్ శర్మకు మద్దతుగా ఏర్పాటైన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని మార్చేందుకు పూనుకున్నారని ఆరోపించారు. మే 20న ఐదో దశ ఎన్నికల్లో భాగంగా అమేథిలో పోలింగ్ జరగనుంది. తాను 42 ఏండ్ల కిందట తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చానని రాహుల్ గుర్తుచేసుకున్నారు.
తాను రాజకీయాల గురించి ఓనమాలు నేర్చుకుంది అమేథి గడ్డపైనేనని అన్నారు. ఆ సమయంలో అమేథిలో రోడ్లు లేవని, ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పారు. ఇక్కడి ప్రజలకు, తన తండ్రికి మధ్య ప్రేమ, ఆప్యాయతలను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్నానని మీరు భావించవద్దని, తానెన్నడూ ఇక్కడి వాడినేనని అన్నారు.
ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, తాము రాజ్యాంగాన్ని తిరగరాస్తామని, దాన్ని విసిరిపారేస్తామని తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారని అన్నారు. మన రాజ్యాంగం గాంధీజీ, అంబేడ్కర్, నెహ్రూ సహా దేశ పౌరులందరి వారసత్వమని రాజ్యాంగ ప్రతిని చూపుతూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, రాజస్ధాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు.
Read More :