లండన్ : భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆందోళన వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం ఉపన్యసించిన రాహుల్ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన వ్యవస్ధలు నిర్భందానికి లోనవుతున్నాయని వ్యాఖ్యానించారు. తనపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్ వాడుతోందని అన్నారు. 21వ శతాబ్ధంలో బోధనలు అనే అంశంపై వర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు.
భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. విపక్ష నేతలపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్‌ను వినియోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన ఫోన్‌పైనా పెగాసస్‌తో నిఘా పెట్టారని వివరించారు. తనతో సహా విపక్ష నేతలపై ఫోన్లపై నిఘా పెట్టారని, తాను ఫోన్లో మాట్లాడేసమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
మీడియా, న్యాయవ్యవస్ధను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుందని మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో చెలరేగుతూ అసమ్మతిని అణిచివేస్తోందని దుయ్యబట్టారు. వారం రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ బిగ్ డేటా, ప్రజాస్వామ్యం, భారత్ -చైనా సంబంధాలపై జరిగే పలు సెషన్స్‌లో పాల్గొంటారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ బ్రిటన్ చాప్టర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపడంతో పాటు వారాంతంలో లండన్‌లో జరిగే భారత సంతతికి చెందిన వారితో సమావేశమవుతారు.
Read More :