Rahul Gandhi : రాయ్‌బరేలి, అమేథిలో తమ విజయానికి అలుపెరగకుండా శ్రమించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. రాయ్‌బరేలిలో మంగళవారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయోధ్యలో బీజేపీ ఓటమి పాలైందని, అయోధ్యే కాదు వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే ప్రధాని మోదీకి పరాజయం తప్పేదికాదని అన్నారు.
ఈసారి అమేథి, రాయ్‌బరేలి, యూపీ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఎన్డీయేపై పోరాడిందని అన్నారు. ఎస్పీ నేతలు, శ్రేణులు కాంగ్రెస్‌తో కలిసి ఐక్యంగా ఎన్నికల్లో పోరాడటంతో మెరుగైన ఫలితాలు రాబట్టగలిగామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాయ్‌బరేలి ప్రజలు రాహుల్ గాంధీ తమ ఎంపీగా కొనసాగాలని కోరుకుంటున్నారని, వ్యక్తిగతంగా తాను కూడా రాహుల్ రాయ్‌బరేలి నుంచే పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటానని అంతకుముందు అమేథి కాంగ్రెస్ ఎంపీ కిషోరీ లాల్ శర్మ పేర్కొన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలి, కేరళలోని వయనాద్ స్ధానాల నుంచి రాహుల్ గాంధీ పోటీచేయగా, రెండు స్ధానాల్లోనూ ఆయన విజయం సాధించారు.
Read More :