న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని చెబుతూ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల విజయానికి కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, వాలంటీర్లకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని దేశ ప్రజల ప్రయోజనాల కోసం పాటుపడతామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇక యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
పంజాబ్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు ఏ రాష్ట్రంలోనూ బీజేపీని కాంగ్రెస్ నిలువరించలేకపోయింది. యూపీలో కేవలం ఒక స్ధానంలోనే కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగుతుండటం ఆ పార్టీ శ్రేణులను కలవరపరిచింది. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పోటీచేసిన రెండు స్ధానాల్లోనూ ఓటమి చవిచూశారు.