బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Polls) తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు రెండేండ్ల పాటు నెలకు రూ. 3000 అందచేస్తామని, డిప్లమో హోల్డర్లకు రూ. 1500 ఇస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బెలగావిలో సోమవారం జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కాంట్రాక్టర్ల నుంచి కాషాయ ప్రభుత్వం 40 శాతం కమీషన్లు దండుకుంటోందని ఆరోపించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదేండ్లలో యువతకు పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్రంలో 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ పేర్కొన్నారు.తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా నిరుద్యోగ యువత తనను కలిసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని వాపోయారని గుర్తుచేసుకున్నారు. మహిళలు కూడా వారి సమస్యలను తనతో విన్నవించుకున్నారని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ నెలకు రూ. 2000 అందచేస్తామని, దారిద్ర్య రేఖన దిగువన ఉన్న కుటుంబాలకు పది కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. భారత్ జోడో యాత్రలో ఎక్కడా విధ్వంసం, విద్వేషం లేదని అన్నారు.
సోదరభావం, అందరినీ గౌరవించే తత్వం తమదని చెప్పుకొచ్చారు. దేశం ఏ కొద్ది మందిదో కాదని, ఈ దేశం అందరిదనీ అన్నారు. భారత్ అదానీది కాదని, ఈ దేశ రైతాంగం, రైతు కూలీలు, యువత, పేదలదని రాహుల్ స్పష్టం చేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Read More :
India Corona | దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో ఎన్ని కేసులంటే..?
marriage cancelled | ఫుల్గా మద్యం సేవించి పెళ్లి సంగతి మరిచిన వరుడు.. వివాహాన్ని రద్దు చేసిన వధువు