న్యూఢిల్లీ, మార్చి 8: కాంగ్రెస్‌లో ఉంటూ కొందరు బీజేపీ కోసం పనిచేస్తున్నారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్లో పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో అవసరమైతే స్లీపర్ సెల్స్‌గా వ్యవహరిస్తున్న 30-40 మందిని పార్టీ నుంచి తొలగించడానికి సిద్ధమేనని అన్నారు. రాహుల్ హెచ్చరికలను బీజేపీ ఎద్దేవా చేసింది. పార్టీకి పెద్ద ఆస్తి లాంటి సొంత పార్టీ నేతలనే ఆయన తప్పుబట్టారని, వాస్తవానికి ‘బీజేపీకి రాహులే అతిపెద్ద ఆస్తి’ అని పేర్కొంది. పార్టీలో రెండు రకాల నాయకులు ఉన్నారని, వారిలో కొందరు నిత్యం ప్రజలతో నిజాయితీగా మమేకం అయి ఉంటుండగా, మరికొందరు ప్రజలకు దూరంగా ఉంటున్నారని రాహుల్ గాంధీ చెప్పారు.
ప్రజలకు దగ్గర అవ్వాలంటే ఆ రెండు గ్రూపులను విడదీయాల్సి ఉందని, ప్రజల కోసం పనిచేయని వారిని సాగనంపాల్సి ఉందని ఆయన చెప్పారు. ‘ఎవరైతే కాంగ్రెస్‌లో ఉంటూ రహస్యంగా బీజేపీకి పనిచేస్తున్నారో వారంతా బయటకు రావాలి’ అని రాహుల్ పేర్కొన్నారు. 30 ఏండ్లుగా గుజరాత్లో అధికారంలో లేని కాంగ్రెస్ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. కేవలం ఎన్నికల మీద మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తే ప్రజల విశ్వాసాన్ని పొందలేమని అన్నారు. మన బాధ్యతలు నెరవేర్చే వరకు గుజరాత్ ప్రజలు మనల్ని ఎన్నుకోరని, మొదట మనం ప్రజల నమ్మకాన్ని చూరగొనాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రస్తావిస్తూ రాహుల్ బీజేపీకి పెద్ద ఆస్తి అని వ్యాఖ్యానించారు.