Rahul on Savarkar | ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని తురువెక్రెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రెండు సార్లు సావర్కర్‌పై ఇలాంటి కామెంట్స్ చేసిన రాహుల్ ఇప్పుడు మరోసారి మాట్టాడారు.
స్వాతంత్య్ర పోరాటంలో వీర్ సావర్కర్.. బ్రిటీష్ వారి కోసం పనిచేశారని, వారికి సహకరించినందుకు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారని రాహుల్ ఆరోపించారు. బ్రిటిషర్లకు ఆర్ఎస్ఎస్ కూడా తోడ్పాటునందించిందని దేశ విభజనపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వారి ద్వేషానికి వ్యతిరేకంగానే ఇవాళ భారత్ జోడో యాత్ర చేపట్టాల్సి వస్తున్నదని అన్నారు. దేశంలోని ప్రజలు అవినీతితో సతమతమవుతున్నారని, మీడియాను కూడా ప్రభుత్వం నియంత్రిస్తున్నదని రాహుల్ ఆరోపించారు. రిమోట్ కంట్రోల్ ద్వారా కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేయరని స్పష్టం చేశారు. కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఎన్నికల తర్వాత పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.
రాజస్థాన్‌లో అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టడంపై రాహుల్ మాట్లాడుతూ.. ‘నేను కార్పొరేట్‌కు వ్యతిరేకం కాదు.. గుత్తాధిపత్యానికి వ్యతిరేకం.. రాజస్థాన్‌లో అంతా బాగానే ఉంది.. అక్కడ అదానీకి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి అధికారాన్ని ఉపయోగించడం లేదు.. ఎప్పుడైనా ప్రభుత్వం వారికి బెనిఫిట్స్ ఇస్తే తొలుత నేనే నిరసన తెలుపుతా..’ అని వివరించారు. పీఎఫ్ఐ నిషేధంపై మాట్లాడుతూ.. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడండి.. ఏ సంఘం నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదు.. ఎక్కడి నుంచి వచ్చినా విద్వేషం, హింసకు వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు.