న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురువారం స్పందించారు. నెహ్రూజీ తాను చేసిన పనులతో ప్రజల్లో గుర్తింపు పొందారని కేవలం ఆయన పేరుతోనే కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది.
ప్రధాని మోదీ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడం, నిరాకరించడమనే ఏకసూత్ర అజెండాతో ముందుకెళుతున్నారని మండిపడింది. నెహ్రూ వారసత్వంపై ప్రభుత్వ దాడి, అణిచివేత కొనసాగినా జవహర్లాల్ నెహ్రూ ఘన వారసత్వం ఉనికిలో ఉంటుందని, రాబోయే తరాలకు నెహ్రూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని స్పష్టం చేసింది.
మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విషయంలో మోదీకి ఎన్నో భయాలు, అభద్రత వంటివి ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ( Jairam Ramesh) ట్వీట్ చేశారు. మ్యూజియం పేరు నుంచి ఎన్ను తొలగించిన ప్రధాని పీని చేర్చారని అన్నారు. స్వాతంత్రోత్సవంలో నెహ్రూ పాత్రను మోదీ తోసిపుచ్చలేరని, దేశ ప్రజాస్వామ్య, లౌకిక విలువల పటిష్టం కోసం, శాస్త్ర సాంకేతిక పురోగమనానికి నెహ్రూ అందించిన సేవలు విస్మరించలేరని పేర్కొన్నారు. మోదీ ఆయన భజనపరులు నెహ్రూ సేవలను తక్కువ చేసేందుకు చౌకబారు ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు.
Read More :