Rahul Gandhi : భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నదుర్బార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. తన చేతిలో రెడ్ బుక్ (రాజ్యాంగ ప్రతి) ఉండటాన్ని అర్బన్ నక్సలిజం అంటూ బీజేపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని ఒక్కసారి కూడా చదవకపోవడంవల్లే రెడ్ బుక్‌లో ఏం లేదని, ఖాళీ అని అంటున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగం భారతదేశ ఆత్మ అనే విషయాన్ని మోదీ గ్రహించాలని సూచించారు. బిర్సా ముండా, మహాత్మా పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ తదితర మహనీయుల స్ఫూర్తి రాజ్యాంగంలో ఉందని తెలిపారు. రాజ్యాంగంలో ఏం లేదని అంటే ఆ మహనీయులను అవమానించినట్టేనని అన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్‌లు ఆదివాసీలను వనవాసీలని పిలుస్తూ గిరిజనులను అవమానిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. గిరిజనులు అడవికే పరిమితం కావాలనేది బీజేపీ ఆలోచన అని విమర్శించారు. దేశంలో ఆదివాసీలు, దళితులు, బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియాలంటే కుల గణన చేపట్టాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఆదివాసీలు, దళితులు, బీసీలకు రాజ్యాధికారం ఉండాలనేది తన లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.