న్యూఢిల్లీ : సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం మరోసారి నిప్పులు చెరిగారు. పరిహారం చెల్లించకపోవడంతో పాటు మోదీ సర్కార్ కనీసం మరణించిన రైతులను గుర్తించలేదని దుయ్యబట్టారు.
రైతుల నిరసనల్లో మరణించిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా అని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి రికార్డులు లేనందున అసలు పరిహారం ప్రశ్నే ఉత్పన్నం కాదని వ్యవసాయ శాఖ బదులిచ్చిందని రాహుల్ మండిపడ్డారు. మరణించిన రైతుల పేర్లు తెలియవని ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. ప్రధాని స్వయంగా తాను పొరపాటు చేశానని అంటూ రైతులకు క్షమాపణలు చెప్పారని, ఆయన చేసిన పొరపాటుకు 700 మంది రైతులు మరణిస్తే ఇప్పుడు వారి పేర్లు తనకు తెలియవని మోదీ బుకాయిస్తున్నారని విమర్శించారు.
వారికి గౌరవంగా దక్కాల్సినవి ఇచ్చి మీ హుందాతనం కాపాడుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రధానిని రాహుల్ నిలదీశారు. రైతుల ఆందోళనలో మరణించిన 500 మంది రైతుల జాబితాను తాము అందచేస్తున్నామని మిగిలిన వారి పేర్లు త్వరలో అందచేస్తామని రాహుల్ చెప్పారు. మరణించిన రైతులకు సభలో సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం రెండు నిమిషాల సమయం ఇవ్వలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద మరణించిన రైతుల జాబితా లేకుంటే తామిచ్చే జాబితా తీసుకుని బాధిత రైతాంగానికి పరిహారం చెల్లించాలని రాహుల్ డిమాండ్ చేశారు.