Ravi Shankar Prasad : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (MVA) ఓటమికి ఈవీఎంల (EVMs) ట్యాంపరింగే కారణమని ఆ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కూడా ఈవీఎంలలో అవకతవకాలు జరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారి పార్టీ ఎక్కడ ఓడిపోతే అక్కడ ఈవీఎంలను తప్పుపట్టడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ‘మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయింది కాబట్టి ఈవీఎంలను తప్పుపడుతున్నారని, మరి జార్ఖండ్‌లో బీజేపీ ఓడిపోయిందిగా అక్కడ ఈవీఎంలు కరెక్టుగా ఉన్నట్టా..?’ అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన తీరు మార్చుకోవాలని, రాహుల్‌గాంధీ ఓటమిని అంగీకరించడం నేర్చుకోవాలని సూచించారు.