మంగళవారం 14 జూలై 2020
National - Jul 01, 2020 , 07:23:43

నేడు వివిధ దేశాల్లోని భారతీయ నర్సులతో రాహుల్‌గాంధీ సమావేశం

నేడు వివిధ దేశాల్లోని భారతీయ నర్సులతో రాహుల్‌గాంధీ సమావేశం

ఢిల్లీ : న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, యూకే, భారత్‌లో పనిచేస్తున్న నలుగురు భారతీయ నర్సులతో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమై సంభాషించనున్నారు. కోవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంతో వారు తమ అనుభావాల్ని ఈ సందర్భంగా పంచుకోనున్నారు. న్యూజిలాండ్‌లో పనిచేసే అను రాగ్నాట్‌, ఆస్ట్రేలియాలో పనిచేసే నరేంద్ర సింగ్‌, యూకేలో పనిచేసే షెర్లిమోల్‌ పురవాడి, ఢిల్లీ ఎయిమ్స్‌లో పనిచేసే విపిన్‌ కృష్ణన్‌ లతో రాహుల్‌ గాంధీ మాట్లాడనున్నారు. వీరిలో విపిన్‌ కృష్ణన్‌ ఇటీవలే కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు.  

తాజా ఎపిసోడ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి గురించి, భారతీయ నర్సులను ప్రపంచవ్యాప్తంగా ఎందుకు గౌరవిస్తారో వంటి అంశాలపై రాహుల్‌ మాట్లాడనున్నట్లు ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు. ఇతర విషయాలతో పాటు కోవిడ్‌-19 వాతావరణంలో పనిచేస్తున్న నర్సుల కుటుంబ జీవితాలపై పడే ప్రభావాన్ని కూడా రాహుల్‌ చర్చించనున్నారు. నర్సులతో రాహుల్‌గాంధీ సంభాషణ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలపై ఈ ఉదయం 10 గంటల ప్రసారం కానుంది.

గడిచిన ఇంటారాక్షన్‌ సెషన్స్‌లో అమెరికా దౌత్యవేత్త నికోలస్‌ బర్న్స్‌, ప్రపంచ ప్రముఖ ఆర్థికవేత్తలు రఘురామ్‌ రాజన్‌, అభిజిత్‌ బెనర్జీ, ప్రఖ్యాత ఎపిడెమియాలజిస్ట్‌ జోహన్‌ గీస్కే, ప్రపంచ ఆరోగ్య నిపుణుడు ఆశిష్‌, భారత పారిశ్రామికవేత్త రాజీవ్‌ బజాజ్‌లతో రాహుల్‌ గాంధీ కరోనా మహమ్మారి విజృంభన, ఆర్థిక సంక్షోభం వంటి అంశాలపై చర్చించారు. 


logo