Rahul Gandhi | సాంటాక్లారా, మే 31: ‘కొంతమంది ఉంటారు, తమకే అంతా తెలుసునని భావిస్తారు, దేవుడికన్నా తమకే ఎక్కువ తెలుసునని భావించే వ్యక్తుల్లో ప్రధాని మోదీ ఒకరు. విశ్వం ఎలా ఏర్పడిందో ఆయన దేవుడికే చెప్పగలరు’ అంటూ రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కాలిఫోర్నియాలోని సాంటాక్లారాలో, భారతీయ అమెరికన్లకు కొన్ని విషయాలు చెప్పాలంటూ ప్రధాని మోదీ, ఆయన సర్కార్‌పై మాట్లాడారు. ‘విశ్వం ఎలా ఏర్పడిందో దేవుడికే చెప్పగల ఘనుడు మోదీజీ, ఇలాంటి వ్యక్తులు చరిత్రకారులకు చరిత్ర పాఠాలు చెప్పగలరు.
సైంటిస్టులకు సైన్స్ బోధిస్తారు. యుద్ధం ఎలా ఉంటుందో ఆర్మీకి వివరిస్తారు’ అంటూ మోదీ తీరును ఎద్దేవా చేశారు. ‘మొహబ్బత్ కీ దుకాణ్’ పేరుతో అమెరికాలోని కాంగ్రెస్ మద్దతుదారులు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఏమీ తెలియదు, అతడో ఫేక్ గాంధీ అని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి రెండు రోజుల క్రితం విమర్శలు చేయగా, దీనిపై స్పందించిన రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ వ్యంగ్యబాణాలు ఎక్కుపెట్టారు.
‘తమకే అంతా తెలుసునని ఇలాంటి వ్యక్తులు ప్రజల్ని నమ్మిస్తారు. ఇలాంటి వ్యక్తుల ముఠా ఒకటి భారత్‌లో ఉంది. దేవుడికన్నా తమకే ఎక్కువ తెలుసునని ప్రజల్ని నమ్మిస్తున్నారు. ప్రధాని మోదీ ఈ తరహా వ్యక్తే. సంక్లిష్టమైన ఇంతపెద్ద ప్రపంచంలో తనకే అంతా తెలుసునని భావించటం ఓ రోగం. విశ్వం ఎలా ఉందన్న సంగతి దేవుడికి చెప్పి, ప్రధాని గందరగోళపర్చగలరు. ఎదుటివారు చెప్పింది వినకపోవటమన్నది ఇలాంటి వాళ్లలో సామాన్యంగా కనిపించే లక్షణం’ అంటూ ఓ రేంజ్లో ప్రధాని మోదీని, ఆయన తీరును ఏకిపారేశారు. లాస్ ఏంజిల్స్, సిలికాన్ వ్యాలీ, కెనడా..మొదలైన చోట్ల నుంచి కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది
భిన్న ఆలోచనల్ని కలిగిన భారత్‌పై దాడులు జరుగుతున్నాయని, సవాళ్లు ఎదురవుతున్నాయని రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, అధిక ధరలు, విద్వేషపూరిత ప్రసంగాలు…ముఖ్య సమస్యగా మారాయని, వీటిపై ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ, మరోవైపు రాజదండం పేరుతో ప్రధాని హంగామా చేశారని అన్నారు.