న్యూఢిల్లీ: నిరుద్యోగం భారత్‌లో అతి పెద్ద మహమ్మారి అని, అయితే ఉద్యోగాలు అడిగిన యువతకు బీజేపీ లాఠీదెబ్బలనే బహుమతిగా ఇస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తీవ్ర నిరుద్యోగంతో బాధ పడుతున్న బీహార్, యూపీ యువత ఉద్యోగ హక్కు కోసం రోడ్డెక్కితే వారిని అతి క్రూరంగా లాఠీలతో బాదుతున్నారని ఆరోపించారు. ‘తమ ఉద్యోగ హక్కు కోసం శుక్రవారం పాట్నాలో శాంతియుతంగా ఆందోళన చేసిన ఉపాధ్యాయ ఆశావహులను బీహార్ పోలీసులు మరోసారి క్రూరంగా కొట్టారు.
నిరుద్యోగ యువకులకు బీజేపీ స్పందన లాఠీ దెబ్బలు’ అని ఎక్స్‌లో విమర్శించారు. లక్షలాది మంది యువత డిగ్రీలు, చేతిలో నైపుణ్యాలతో ఉద్యోగం కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, అయితే బీజేపీ ప్రభుత్వం వారి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఒక వేళ యువత తమ హక్కుల కోసం రోడ్డెక్కితే మాత్రం వారిపై లాఠీలను ఝళిపిస్తూ వారి వీపులు పగులగొడుతున్నారని విమర్శించారు.